||సుందరకాండ ||

||పదహేనవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 15 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచదశస్సర్గః

శ్లో|| సవీక్షమాణ స్తత్రస్థో మార్గమాణశ్చ మైథిలీమ్|
అవేక్షమాణశ్చ మహీం సర్వాం తామన్వవేక్షత||1||

స||తత్రస్థః వీక్షమాణః మైథిలీం మార్గమాణః అవేక్షమాణఃచ సః హనుమాన్ తాం సర్వాం మహీం అవేక్షత||

తా|| మైథిలిని వెదుకుతూ ఛూడడానికి అక్కడ కూర్చుని వున్నఆ హనుమంతుడు పరిసర ప్రాంతములు అన్నీ చూడసాగెను .

శ్లో|| సంతానకలతాభిశ్చ పాదపైరుపశోభితామ్ |
దివ్యగన్ధరసోపేతాం సర్వతః సమలంకృతామ్||2|

స||సంతానకలతాభిశ్చ పాదపైః ఉపశోభితామ్ దివ్యగంధరసోపేతామ్ సర్వతః సమలంకృతామ్ (తాం వనికాం మారుతిః సముదైక్షత) ||

తా|| ( ఆ అశోకకవనిక) సంతానక లతలతో కూడిన వృక్షములతో శోభిస్తున్న , దివ్యమైన వాసనలుగల పిల్ల వాయువులతో నిండివున్నది

శ్లో|| తాం స నన్దనసంకాశాం మృగపక్షిభి రావృతాం|
హర్మ్యప్రాసాద సంభాధాం కోకిలాకులనిస్వనామ్|| 3||
కాఞ్చనోత్పలపద్మాభిః వాపీభిరుపశోభితామ్|
బహ్వాసనకుథోపేతాం బహుభూమి గృహాయుతామ్||4||
సర్వర్తుకుసుమై రమ్యాం ఫలవద్భిశ్చ పాదపైః|
పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయప్రభామ్||5||
ప్రదీప్తమివ తత్రస్థో మారుతిః సముదైక్షత|

స|| తాం నందన సంకాశం పాదపైః ఉపశోభితమ్ మృగపక్షిభిః ఆవృతం కోకిలాకులనిఃశ్వనామ్ హర్మ్యప్రాసాద సంభాదాం (తాం వనికాం దదర్శ) || (అశోక వనికా) కాంచనోత్పలపద్మాభిః వాపీభిః ఉపశోభితాం బహ్వాసనకుథోపేతాం బహుభూమి గృహాయుతమ్ (అస్తి) || (తత్ అశోకవనికా) సర్వర్తుకుసుమైః ఫలవద్భిః పుష్పితానాం అశోకానాం పాదపైః రమ్యాం, సూర్యోదయ ప్రభాం ఇవ ప్రదీప్తం (వనికామ్) తత్రస్థః మారుతిః సముదైక్షత ||

తా|| నందనవనముతో సమానముగాగల వృక్షములతో శోభిస్తున్న, మృగాలతో పక్షుల తో నిండిన, కోకిలల కిలకిలారావముతో నిండిన, మేడలు మిద్దెలతో కూడిన ఆ అశోకవనిక బంగారురేకులుగలపద్మములతో నిండిన చెరువులతో శోభిస్తున్నది. అనేకమైన ఆసనములతో భూగృహములతో కూడినది. అన్ని ఋతువులలో పుష్పించుకుసుమములు పుష్పములు ఫలములు కల , రమ్యమైన ఉదయభానుని కిరణముల వలె ప్రజ్వలిస్తూ వున్న అశోకవనమును ఆ వృక్షముపైనున్న మారుతి చూచెను .

శ్లో|| నిష్పత్రశాఖాం విహగైః క్రియమానా మివాసకృత్||6||
వినిష్పతద్భిః శతశః చిత్రైః పుష్పావతంసకైః|
అమూలపుష్పనిచితైః అశోకైః శోకనాశనైః||7||

స|| అసకృత్ వినిష్పతద్భిః శతశః విహగైః నిష్పత్రశాఖాం క్రియమాణాం ఇవ చిత్రైః పుష్పావతంసకైః అమూలపుష్పనిచితైః శోకనాశనైః అశోకైః (అస్తి) ||

తా|| (ఆ అశోకవనములో) వందలకొలదీ పక్షులు వాలడమువలన రాలిపోయిన ఆకులు గల శాఖలతో వున్న వృక్షములు చిత్రీకరింపబడినట్లు వున్నాయి. శోకమును నాశనము చేయు అశోకవృక్షములతో ఆ వనిక క్రిందనించి పైదాకా పుష్పములతో నిండిన యున్నది.

శ్లో|| పుష్పభారాతిభారైశ్చ స్పృశద్భిరివ మేదినీం|
కర్ణికారైః కుశుమితైః కింశుకైశ్చ సుపుష్పితైః||8||
స దేశః ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ పర్వతః|
పున్నగా సప్తవర్ణాశ్చ చమ్పకోద్దాలకాస్తథా||9||
వివృద్ధమూలా బహవః శోభన్తే స్మ సుపుష్పితాః|

స|| పుష్పభారాతిభారైశ్చమేదినీం స్పృశద్భిః ఇవ కుశుమితైః కర్ణికారైః కింశుకైశ్చ సుపుష్పితైః (తాం వనికాం మారుతిః దదర్శ)||తేషాం ప్రభయా సః దేశః సర్వతః ప్రదీప్త ఇవ| వివృద్ధమాలాః సుపుష్పితాః పున్నగాః సప్తపర్ణస్చ తథా చంపకాః ఉద్దాలకాః శోభన్తే స్మ||

తా|| బాగా పుష్పములతో విరబూచిన పుష్పభారముతో భూమిని స్పృశించుచున్నవా అన్నట్లు వున్న కర్ణికార, కింశుక వృక్షములతో నిండి యున్నది. ఆ వృక్షముల కాంతులతో ఆ ప్రదేశము అంతా ప్రజ్వలిస్తున్నట్లు వుంది. అక్కడ బారులుగావున్న సుపుష్పితమైన పున్నాగ, సప్తపర్ణ చంపక ఉద్దాలక వృక్షములు శోభించుచున్నాయి.

శ్లో|| శాతకుమ్భనిభాః కేచిత్ కేచిదగ్ని శిఖోపమాః||10||
నీలాఙ్జననిభాః కేచిత్ తత్రాఽశోకా సహస్రశః|

స|| తత్ర సహస్రశః కేచిత్ శాతకుమ్భనిభాః కేచిత్ అగ్నిశిఖోపమాః కేచిత్ నీలాంజననిభాః అస్తి||

తా|| అక్కడ వేలకొలది వున్న అశోకవృక్షములలో కొన్ని బంగారుకాంతులతో శోభిస్తున్నాయి. కొన్ని అగ్నిశిఖలులాగ వున్నాయి.

శ్లో|| నన్దనం వివిధోద్యానం చిత్రం చైత్రరథం యథా||11||
అతివృత్త మివాచిన్త్యం దివ్యం రమ్యం శ్రియా వృతం|
ద్వితీయ మివ చాకాశం పుష్పజ్యోతి ర్గణాయుతమ్ ||12||
పుష్పరత్నశతై శ్చిత్రం పఞ్చమం సాగరం యథా |
సర్వర్తుపుష్పైర్నిచితం పాదపైర్మధుగన్దిభిః||13||
నానానినాదైరుద్యానం రమ్యం మృగగణైర్ద్విజైః|
అనేక గన్ధప్రవహం పుణ్యగన్ధం మనోరమమ్||14||

స|| నందనం యథా వివిధ ఉద్యానమ్ చిత్రం చైత్ర రథం యథా అతివృత్తం అచింత్యం దివ్యం రమ్యం శ్రియా వృతం పుష్పజ్యోతిర్గణాయుతం ద్వితీయం ఆకాశమ్ ఇవ పుష్పరత్నశతైః చిత్రం , ద్వితీయం సాగరం యథా సర్వఋతుపుష్పైః మధుగన్ధిభిః పాదపైః , ద్విజైః మృగ గణైః నానానినాదైః నిచితం రమ్యం అనేకగన్ధప్రవహం పుణ్యగంధంమనోరమమ్ అస్తి ||

తా|| వివిధ ఉద్యానములతో వున్న ఆ అశోక వనము నందన ఉద్యానము వలె నున్నది. అనేక రంగులుకల ఆ ఉద్యానము కుబేరుని చైత్రరథము అనే ఉద్యానము వలె నున్నది. అతి దివ్యము రమ్యము శ్రియముతో వున్న ఆ ఉద్యానవనము పుష్పములతో నిండి జ్యోతిర్గణములతో నున్న రెండవ ఆకాశము వలె నున్నది. వందలకొలది పుష్పములతో ఆ వనము రెండవ సాగరము వలె నున్నది. అన్ని ఋతువులలోపుష్పించు పుష్పములతో, మధుగంధపు వాసనలతో వున్న వృక్షములతో , పక్షుల మృగముల నినాదములతో నిండిన, అనేకమైన గంధములుకల వాయువులతో మనోరమముగా వున్నది.

శ్లో|| శైలేంద్రమివ గన్ధాఢ్యం ద్వితీయం గన్ధమాదనమ్|
అశోకవనికాయాం తు తస్యాం వానరపుంగవః ||15||
సదదర్శా విదూరస్థం చైత్యప్రాసాద ముచ్ఛ్రితమ్|
మధ్యే స్తమ్భ సహస్రేణ స్థితం కైలాసపాణ్డురమ్||16||
ప్రవాళాకృత సోపానం తప్తకాఞ్చనవేదికం|
ముష్ణన్తమివ చక్షూంషి ద్యోతమానమివ శ్రియా||17||
విమలం ప్రాంశుభావత్వా దుల్లిఖన్త మివామ్బరమ్|

స|| సః వానరపుంగవః తస్యాం అశోకవనికాయామ్ మధ్యే గన్ధమాడ్యం గన్ధమాదనమ్ ఇవ స్తంభ సహస్రేణ స్థితమ్ కైలాసపాణ్డురమ్ ప్రవాళకృతసోపానమ్ తప్తకాంచన వేదికాం చక్షూంసి ముష్ణన్తం ఇవ శ్రియా ద్యోతమానం ఇవ విమలం ప్రాంశుభావత్వాత్ అంబరం ఉల్లిఖంతమివ అవిదూరస్థం ఉచ్ఛ్రితమ్ చైత్య ప్రాసాదమ్ దదర్శ||

తా|| ఆ వానరపుంగవుడు ఆ అశోకవనిక మధ్యలో దగ్గరలోనే వేయి స్తంభములతో తెల్లని కైలాసములా వున్న, పగడములతో చేయబడిన మెట్లు కల, బంగరుపూతలతో చేయబడిన వేదికలు కల, కళ్ళకి మిరుమిట్లు గొలిపే , ఆకాశమును అంటుచున్నదా అని ఉన్నట్లు వున్న ఒక పెద్ద చైత్యప్రాసాదమును చూచెను

శ్లో|| తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతామ్||18||
ఉపవాసకృశాం దీనాం నిశ్స్వసన్తీం పునః పునః|
దదర్శ శుక్లపక్షాదౌ చన్ద్రరేఖామివామలామ్||19||

స|| తతః మలినసంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం పునః పునః నిఃశ్వసంతీం శుక్లపాక్షాదౌ అమలాం చన్ద్రరేఖామివ ( అబలాం) తాం దదర్శ||

తా|| అక్కడ మలినవస్త్రములు ధరించిన రాక్షసస్త్రీలతో చుట్టబడియున్న ఉపవాసములతో కృశించియున్నదీనముగా మరల మరల నిట్టూర్పులు విడుచుచున్న శుక్లపక్షములో నిర్మలమైన చంద్రరేఖవలె నున్న స్త్రీని చూచెను.

శ్లో|| మన్దం ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం|
పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోః||20||
పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాససా|
సపఙ్కాం అనలఙ్కారం విపద్మామివ పద్మినీమ్ ||21||
వ్రీడితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీమ్|
గ్రహేణాఙ్గారకేణేవ పీడితామివ రోహిణీమ్||22||

స|| (సా) మన్దం ప్రఖ్యాయమానేన రూపేణ ధూమజలేన పినద్ధాం రుచిరప్రభామ్ విభావసోః శిఖామివ(అస్తి) || వినష్టేన పీతేన ఏకేన ఉత్తమవాససా అనలఙ్కృతాం సపఙ్కం విపద్మాం పద్మినీం ఇవ |వ్రీడితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం అంగారకేణ గ్రహేణా పీడితాం రోహిణీం ఇవ ( చ అస్తి) |

తా|| పొగచే ఆవృతమైన అగ్నిజ్వాలవలె ఆమె సౌందర్యము స్పష్ఠముగా కానరాక ఉన్నది. అలంకారములు లేకుండా జీర్ణించిన ఒక ఉత్తమ తరగతి పీతవస్త్రమును ధరించియున్న ఆమె, పద్మములు లేని తామరకొలను వలె నున్నది. ఆమె దుఃఖములో మునిగి తలవంచుకొనియున్నది. తపస్వినివలె నున్నది. అంగారకగ్రహముచేత పీడింపబడిన రోహిణి వలె నున్నది.

శ్లో|| అశ్రుపూర్ణముఖీం దీనాం కృశామనశనేన చ|
శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణామ్||23||
ప్రియం జనమపశ్యంతీం పశ్యన్తీం రాక్షసీగణమ్|
స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతా మివ||24||

స|| దుఃఖపరాయణామ్ అశ్రుపూర్ణముఖీం దీనాం అనశనేన కృశాం నిత్యం శోకధ్యానపరాం తాం దదర్శ|| సా ప్రియం జనం అపశ్యంతీం రాక్షసీగణం పశ్యంతీం స్వగణేన హీనాం శ్వగణాభివృతాం మృగీం ఇవ (అస్తి)||

తా|| ఆమె దుఃఖభారముతో నీళ్ళతో నిండిన కళ్లతో ఉపవాసములతో కృశించి దీనముగా ప్రతిక్షణము ధ్యానములో ఉన్నది. ఆమె ప్రియమైన జనులు కానరాక రాక్షసీగణములనే చూస్తూ , ఆమె తన మందనుంచి విడిపోయి వేటకుక్కలతో చుట్టబడియున్న ఆడ జింకవలె ఉండెను.

శ్లో|| నీలనాగాభయావేణ్యా జఘనం గత యైకయా|
నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీమివ||25||
సుఖార్హం దుఃఖసంతప్తాం వ్యసనానాం అకోవిదామ్|

స|| సా జఘనం గతయా నీలనాగాభయా వేణ్యా నీరదాపాయే నీలయా వనరాజ్యా మహీం ఇవ, దుఃఖసంతప్తాం సుఖార్హం వ్యసనానాం అకోవిదాం (అస్తి) |

తా|| జఘనము వఱకు వేలాడుచున్న నల్లని పామువలె ఉన్న ఒంటిజడతో వున్న ఆమె శరద్ ఋతువులో వున్న వృక్షపంక్తితో కూడిన భూమివలె నున్నది.

శ్లో|| తాం సమీక్ష్య విశాలాక్షీం అధికం మలినాం కృశామ్ ||26||
తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః|
హ్రియమాణా తదా తేన రక్షసా కామరూపిణా||27||
యథారూపాహి దృష్టా వై తథా రూపేయ మఙ్గనా|

స|| విశాలాక్షీం అధికం మలినాం కృశాం తాం సమీక్ష్య సీతా ఇతి తర్కయామాస|| ఇయం అంగనా తథారూపా తదా కామరూపిణా తేన రక్షసా హ్రియమాణా యథారూపా దృష్టా ఇతి||

తా|| అధికమైన మలముతో కృశించియున్న ఆ విశాలాక్షిని చూచి ఈమె సీతయా అని తర్కించ సాగెను. ఈ అంగన ఆ కామరూపి అగు రాక్షసుని చేత తీసుకోపోబడిన ఆమె రూపము కలదిగా కనపడుచున్నది.

శ్లో|| పూర్ణ చన్ద్రాననాం సుభౄం చారువృత్తపయోధరామ్||28||
కుర్వన్తీం ప్రభయా దేవీం సర్వా వితిమిరా దిశః|
తాం నీలకేశీం బిమ్బోష్టీం సుమధ్యామ్ సుప్రతిష్టితామ్||29||
సీతాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతిం యథా|

స|| పూర్ణ చంద్రాననాం సుభౄం చారువృత్త పయోధరాం సర్వాః దిశాం ప్రభయా వితిమిరాః కుర్వతీం దేవీం నీలకేశీం బింబోష్టీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతీం యథా సీతాం (దదర్శ) ||

తా|| పూర్ణ చంద్రునిబోలి వున్న , ఆకర్షణీయమైన కనుబొమ్మలతో, అందమైన వృత్తాకారములో ఉన్న పయోధరములతో , అన్ని దిశలలో చీకటిని పారద్రోలు కాంతిని విరజిల్లుచూ, నల్లని జుట్టుగల దేవి, దొండపండువంటి పెదవులుకల , సన్నటి నడుము కల ,పద్మము యొక్క రేకులవంటి కళ్ళు కల, మన్మధుని రతీ దేవి వలె నున్న సీతాదేవి ని హనుమంతుడు చూసెను.

శ్లో|| ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచన్ద్ర ప్రభామివ ||30||
భూమౌ సుతనుమాసీనాం నియతామివ తాపసీం |
నిశ్స్వాసబహుళాం భీరుం భుజగేన్ద్ర వధూమివ ||31||
శోకజాలేన మహతా వితతేన న రాజతీమ్|

స|| సా పూర్ణచన్ద్ర ప్రభాం ఇవ సర్వస్య జగతః ఇష్టాం నియతాం తాపసీం ఇవ భూమౌ ఆసీనామ్ సుతనుం (అస్తి) || సా భీరుం భుజగేన్ద్రవధూమ్ ఇవ నిఃశ్వాసబహుళాం మహతా వితనేన శోఖజాలేన న రాజతీం (అస్తి) ||

తా|| ఆమె పూర్ణచంద్రుని వెన్నెలవలె జగత్తులోని సమస్త ప్రాణులకు ప్రీతిపాత్రురాలు. నియమవతి అయి తపస్వివలె ఆమె భూమి మీద కూర్చుని ఉన్నది. ఆ భయపడుతూ బుసలు కొడుతున్న భుజగేంద్రుని పత్నివలె నిట్టూర్పులు విడుచుచున్న అమె , అధిక శోకముతో ప్రకాశవిహీనముగా వున్నది.

శ్లో|| సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసోః||32||
తాం స్మృతీమివ సన్దిగ్ధామ్ వృద్ధిం నిపతితామివ|
విహతా మివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ||33||
సోపసర్గాం యథాసిద్ధిం బుద్ధిం స కలుషామివ|
అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ||34||
రామోపరోధవ్యధితాం రక్షోహరణ కర్శితామ్|

స||ధూమ్రజాలేన సంసక్తాం విభావసౌ శిఖామివ సందిగ్ధామ్ స్మృతీం ఇవ నిపతితం ఋద్ధమివ తామ్ ( దదర్శ)|| విహతామివ శ్రద్ధాం చ ఆశాం ప్రతిహతాం ఇవ సోపసర్గాం సిద్ధిమ్ ఇవ సకలుషాం బుద్ధిమివ ||అభూతేన అపవాదేన నిపతితాం కీర్తిమివ రామోపరోధవ్యధితాం రక్షోహరణ కర్శితాం (తామ్ దదర్శ)||

తా|| ఆమె ధూమ్రజాలముచేత కప్పబడిన అగ్నిశిఖవలెనున్నది. సందిగ్ధమైన స్మృతి వాక్యమువలె నున్నది. పతితమైన ఐశ్వర్యము వలె నున్నది. ఆమె ఎగిరిపోయిన శ్రద్ధవలెనున్నది. ఓడిపోయిన ఆశవలె, విఘ్నము కలిగిన సిద్ధివలె , కలుషమైన బుద్ధివలె నున్నది. అపవాదముచే క్షీణించిన కీర్తివలె , రాక్షసునిచే అపహరింపబడి రాముని ఏడబాటుతో కృశించి వున్నది.

శ్లో|| అబలాం మృగశాబాక్షీం వీక్షమాణాం తత స్తతః||35||
భాష్పామ్బుపరిపూర్ణేన కృష్ణవక్రాక్షిపక్ష్మణా|
వదనేనాప్రసన్నేన నిశ్స్వసన్తీం పునః పునః||36||
మలపఙ్కధరాం దీనాం మణ్డనార్హాం అమణ్డితామ్|
ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతామ్||37||

స|| మృగశాబాక్షీం భాష్పామ్బుపరిపూర్ణేన కృష్ణవక్రాక్షి పక్ష్మణా అప్రసన్నేన వదనేన తతః తతః వీక్షమాణం పునః పునః నిశ్స్వసన్తీం అబలాం || మలపఙ్కధరాం దీనాం మణ్డనార్హాం అమణ్డితామ్ కాలమేఘైః ఆవృతాం నక్షత్రరాజస్య ప్రభాం ఇవ||

తా|| లేడి కన్నులతో, భాష్పములతో నిండిన నల్లని కనుబొమ్మల కల ఆ అబల ప్రసన్నముకాని వదనముతో మళ్ళీ మళ్ళీ నిట్టూర్పులు విడుచుచూ వున్నది. మలినమైన అంగములతో దీనముగా నున్న, ఆభరణములకు అర్హురాలైనప్పటికీ ఆభర్ణములు లేకుండా వున్న ఆమె, నల్లని మేఘములతో కప్పబడిన నక్షత్రరాజుని వలెనున్నది.

శ్లో|| తస్య సందిదిహే బుద్ధిః ముహుః సీతాం నిరీక్ష్యతు|
ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రశిథిలామివ||38||
దుఃఖేన బుబుధే సీతాం హనుమాననలఙ్కృతామ్|
సంస్కారేణ యథా హీనాం వాచం అర్థాంతరం గతమ్||39||

స|| ఆమ్నాయానాం అయోగేన ప్రశిథిలాం విద్యాం ఇవ సీతాం నిరీక్ష్య తస్య బుద్ధిః తు ముహుః సందిదిహే|| హనుమాన్ అనలంకృతేన సంస్కారేణ హీనం అర్థాంతరం గతం వాచం యథా సీతాం దుఃఖేన బుబుధే||

తా|| మననము చేయకుండా వున్నందువలన మరుగుపడిన విద్యవలె నున్న సీతను చూచి అతని మనస్సులో పదే పదే ఈమె సీతయా అని సందేహము కలుగుచుండెను. అర్ధము లోపించిన శబ్దము వలెనున్న అలంకారము లేక సంస్కారరహితమై కృశించిఉన్న ఆ సీతను అతి దుఃఖముతో తెలిసికొనగలిగెను.

శ్లో|| తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీం అనిందితామ్|
తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః||40||
వైదేహ్యా యాని చాఙ్గేషు తదా రామోఽన్వకీర్తయత్|
తాన్ ఆభరణజాలాని గాత్రశోభీన్యలక్షయత్||41||
సుకృతౌ కర్ణవేష్టౌ చ శ్వదంష్ట్రౌ చ సుసంస్థితౌ|
మణివిద్రుమ చిత్రాణి హస్తేష్వాభరణాని చ ||42||
శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ|

స|| అనిందితాం రాజపుత్రీం విశాలాక్షీం సమీక్ష్య తాం సీతా ఇతి కారణైః ఉపపాదిభిః తర్కయామాస||తదా రామః యాని ఆభరణజాలాని వైదేహ్యాః అంగేషు అన్వకీర్తయత్ గాత్రశోభిని తాని అలక్షయత్ | సుకృతౌ కర్ణవేష్టౌ సుసంస్థితౌ శ్వందష్ట్రౌ చ హస్తేషు మణివిద్రుమ చిత్రాణి ఆభరణాని చ చిరయుక్తత్వాత్ శ్యామాని సంస్థానవంతి చ ||

తా|| నిందింపలేని రాజపుత్రి విశాలాక్షి అగు ఆమెని చూచి ఈమె సీత అని అనేక కారణములతో అలోచించ సాగెను. అప్పుడు రాముడు వైదేహి అంగములలో ఏ ఏ ఆభరణములు కీర్తించెనో వానితో శోభించుచున్న అంగములను చూచెను. సుకృతమైన కుండలములతో, చక్కగా ఉన్న శ్వదంష్ట్రములతో, హస్తములమీద మణులతో రూపొందించబడిన ఆభరణములు, చిరకాలము ఉపయోగించడము వలన మాసిపోయి, శరీరము మీద మచ్చలు చూసెను.

శ్లో|| తాన్యే వైతాని మన్యేఽహం యాని రామోఽన్వకీర్తయత్||43||
తత్రయా న్యవహీనాని తాన్యహం నోపలక్షయే |
యాన్యస్యా నావహీనాని తాన్ ఇమాని నసంశయః||44||
పీతం కనకపట్టాభం స్రస్తం తద్వసనం శుభమ్|
ఉత్తరీయం నగాసక్తం తదా ద్రష్టుం ప్లవఙ్గమైః||45||
భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీ తలే|
అనయైవాపవిద్దాని స్వనవన్తి మహన్తి చ||46||

స||తాని రామః యాని అన్వకీర్తయత్ తాన్యేవ అహం మన్యే| తత్ర యాని అవహీనాని తాని అహం నోపలక్ష్యే | అస్యాః యాని నావహీనాని తాని ఇమాని సంశయః న|| పీతం కనకపట్టాభం శుభం ఉత్తరీయం స్రక్తం నాగసక్తం తత్ వస్త్రం తదా ప్లవఙ్గమైః ద్రష్టం|| నయైవ ధరణీ తలే అపవిద్ధాని స్వనవన్తీ మహన్తి ముఖ్యాని భూషణాని చ ద్రష్టాని||

తా|| "అవి రామునిచే వర్ణింపబడినవే అని అనుకుంటాను. అప్పుడు క్రిందపడవేసినవి నాకు ఇప్పుడు కనపడుట లేదు. మిగిలిన ఆభరణములను మాత్రమే చూచుచున్నాను. ఆ పచ్చని బంగారు వన్నెగల ఆ శుభమైన ఉత్తరీయమును అప్పుడు సీత జారవిడచగా వానరులచే చూడబడినది. తీసుకుపోబడుతూ ధరణీ తలము మీద చప్పుడు చేస్తూ పడవేయబడిన అమూల్యమైన ప్రధానమైన ఆభరణములను వానరులు చూచిరి".

శ్లో|| ఇదం చిరగృహీతత్వాత్ వ్యసనం క్లిష్టవత్తరమ్|
తథాఽపి నూనం తద్వర్ణం తథా శ్రీమత్ యథేతరత్||47||
ఇయం కనకవర్ణాఙ్గీ రామస్య మహిషీ ప్రియా |
ప్రణష్టాఽపి సతీ యాఽస్య మనసో న ప్రణస్యతి||48||

స|| ఇదం వసనం చిరగృహీతత్వాత్ క్లిష్టవత్తరమ్ తథాపి నూనం తద్వర్ణం ఇతరత్ యథా తథా శ్రీమత్|| ఇయం కనకవర్ణాఙ్గీ రామస్య ప్రియా మహిషీ సతీ యా ప్రణష్టాపి అస్య మనసః నప్రణస్యతి ||

తా|| చాలాకాలము ధరింపబడిన ఈ వస్త్రము క్లిష్టముగా ఉన్నది. అయినప్పటికీ దాని రంగు కాంతి అప్పుడు ఎలాగవున్నదో ఇప్పుడు అలాగే ఉన్నది. ఈ బంగారువన్నెగల అవయవములతో నున్న రాముని పట్టమహిషి అపహరింపబడినప్పటికీ ఆయన మనస్సులో చెక్కు చెదరకుండా ఉన్నది.

శ్లో|| ఇయం సా యత్కృతే రామశ్చతుర్భిః పరితప్యతే|
కారుణ్యే నానృశంస్యేన శోకేన మదనేన చ||49||
స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానృశంస్యతః|
పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ||50||

స|| యత్ కృతే రామః ప్రణష్టా స్త్రీ ఇతి కారుణ్యాత్ ఆశ్రితేతి అనృశంస్యతః నష్టా పత్నీ ఇతి శోకేన ప్రియా ఇతి మదనేన కారుణ్యేన ఆనృశంస్యేన శోకేన మదనేన చతుర్భిః పరితప్యతే సా ఇయం||

తా|| తను రక్షించవలసిన ఆమె అపహరింపబడడము వలన కారుణ్యము, తనపై అధారపడిన స్త్రీ కనక దయ, భార్య పోయినందువలన శోకము , తనప్రియురాలు కానరవకపోవడము వలన మదన బాధ, అలాగ నాలుగు విధముల బాధతో రాముడు పరితపిస్తున్నాడు.

శ్లో|| అస్యా దేవ్యా యథా రూపం అఙ్గప్రత్యఙ్గ సౌష్టవమ్|
రామస్య చ యథారూపం తస్యేయ మసితేక్షణా||51||
అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్టితమ్|
తేనేయం స చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి||52||

స|| అస్యాః దేవ్యాః రూపం అఙ్గప్రత్యఙ్గసౌష్టవం యథా చ తస్య రూపం యథా ఇయం అసితేక్షణా|| అస్యాః దేవ్యాః మనః తస్మిన్ తస్య అస్యాం ప్రతిష్టితం| తేన ఇయం ధర్మాత్మా స చ ముహూర్తమపి జీవతి||

తా|| ఆ దేవియొక్క రూపము అంగముల సౌష్టవము ఆయన యొక్క రూపమునకు తగినట్లే ఉన్నాయి. ఈ దేవియొక్క మనస్సు ఆయనపై, అయనయొక్క మనస్సు ఈమె పై ప్రతిష్టింపబడియున్నాయి. అందువలనే ఆ ధర్మాత్ముడు ఈమెయూ క్షణమైన జీవించకలుగుతున్నారు.

శ్లో|| దుష్కరం కృతవాన్ రామో హీనోయదనయా ప్రభుః|
ధారయ త్యాత్మనో దేహం న శోకే నావసీదతి||53||
దుష్కరంకురుతే రామో య ఇమాం మత్తకాసినీమ్|
సీతాం వినా మహాబాహుః ముహూర్తమపి జీవతి||54||

స|| ప్రభుః రామః అనయా హీనః ఆత్మనః దేహం ధారయతి ఇతి యత్ శోకేన న అవసీదతి దుష్కరం కృతవాన్ || యః ఇమామ్ సీతాం మత్తకాశినీంవినా ముహూర్తమపి జీవతి మహాబాహుః రామః దుష్కరం కురుతే||

తా|| రామచంద్ర ప్రభువు ఈమె లేకుండా తన దేహమును శోకముతో ధరించకలుగుచున్నాడు అంటే ఒక కష్టమైన పని సాధించకలిగాడన్నమాట. ఈ యౌవనముతో అలరారుతున్న ఈ సీతని విడచి ఒక క్షణము కూడా జీవించగలడము, మహాబాహువులు కల రాముడు, ఒక చేయలేని కార్యము చేసినట్లే వున్నది.

శ్లో|| ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్టః పవన సంభవః|
జగామ మనసా రామం ప్రశశంస చ తం ప్రభుమ్||55||

స|| పవనసంభవః తదా సీతాం దృష్ట్వా ఏవం హృష్టః మనసా రామం జగాం తాం ప్రభుం ప్రశశంస చ||

తా|| ఆ వాయునందనుడు అలా సీతను చూచి రాముని మనస్సులో తలచుకొని ఆయనను ప్రశంశించి ఈవిధముగా మనస్సులో ఆనందపడెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచదశస్సర్గః||

ఈ విధముగా రామాయణములో పదహేనవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||